Sundaradasu (Sri MS Rama Rao) Sundarakanda Part 2 – సుందరదాసు సుందరకాండ (ద్వితీయ భాగం) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

సుందరదాసు సుందరకాండ (ద్వితీయ భాగం)

తండ్రిమాట నిలుప రామచంద్రుడు
వల్కల ధారియై రాజ్యము వీడె .
సీతాలక్ష్మణులు తనతో రాగా
పదునాల్గేండ్లు వనవాసమేగె . 151
ఖరదూషణాది పదునాల్గువేల
అసురుల జంపె జనస్థానమున .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . 152
రాముడు వెడలె సీత కోర్కె పై
మాయ లేడిని కొనితెచ్చుటకై .
రామ లక్ష్మణులు లేని సమయమున
అపహరించె లంకేశుడు సీతను . 153
సీతను గానక రామచంద్రుడు
అడవుల పాలై వెదకుచుండెను .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . 154
రామసుగ్రీవులు వనమున కలిసిరి
మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి .
శ్రీరఘురాముడు వాలిని గూల్చెను
సుగ్రీవుని కపిరాజుగ జేసెను . 155
సుగ్రీవులాన లంక చేరితి
సీతా మాతను కనుగొన గలిగితి .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . 156
వానరోత్తముడు పలుకుట మానెను
జానకికెంతో విస్మయమాయెను .
భయము భయముగ నలువంకలు గని
మెల్లగ మోమెత్తి పైకి చూచెను . 157
శోభిల్లు శంశుపా శాఖలందున
బాలార్కుని వలె మారుతి తోచెను .
మారుతి రూపము చిన్నదైనను
తేజోమయమై భీతి గొల్పెను . 158 | శ్రీ హనుమాను |
తల్లీ ! తెల్పుము నీవు యెవరవో
దేవ గంధర్వ కిన్నెరాంగనవో .
కాంతులు మెరసే బంగరు మేన
మలినాంబరమేల దాల్చితివో ?159
ఓ కమలాక్షీ ! నీ కనుదోయి
నీలాలేల నింపితివో ?
అని హనుమంతుడు తరువు నుండి దిగి
అంజలి ఘటించి చెంతన నిలిచె . 160
రావణాసురుడు అపహరించిన
రాముని సతివో నీవు సీతవో ?
రామ లక్ష్మణులు వనమున వెదకెడు
అవనీజాతవో నీవు సీతవో ?161
సర్వ సులక్షణ లక్షిత జాతవు
తల్లీ తెల్పుము నీవు యెవరవో ?
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 162
జనక మహీపతి ప్రియ పుత్రికను
దశరథ మహిపతి పెద్ద కోడలను .
శ్రీరఘురాముని ప్రియసతి నేను
సీత యను పేర వరలు దానను . 163
పరిణయమైన పదిరెండేడులు
అనుభవించితిని భోగభాగ్యములు .
అని పల్కె సీత వానరేంద్రునితో
రామ కథను కీర్తించిన వానితో . 164
రావణుడొసగిన యేడాది గడువు
రెండు నెలలో యిక తీరిపోవు .
రాముడు నన్ను కాపాడునని
వేచి వేచి వేసారి పోతిని . 165
అసురులు నన్ను చంపక ముందే
నాకై నేను పోనెంచితిని .
అని పల్కె సీత వానరేంద్రునితో
రామ కథను కీర్తించిన వానితో . 166
అమ్మా సీతా, నమ్ముము నన్ను
రాముని దూతగా వచ్చినాడను .
రామలక్ష్మణులు క్షేమమన్నారు
నీ క్షేమమరసి రమ్మన్నారు . 167
రాముడు నీకు దీవెనలంపె
సౌమిత్రి నీకు వందనములిడె .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి ముందుకు జరిగె . 168
మారుతి యెంతగా ముందుకు జరిగెనో
జానకి అంతగా అనుమానించెను .
రావణాసురుడే ఈ వానరుడని
కామరూపుడై వచ్చి యుండునని . 169
ఆశ్రమమున వొంటిగనున్న తనను
వంచించిన సన్యాసి యీతడని.
తల వాల్చుకొని భయకంపితయై
కటిక నేలపై జానకి తూలె . 170
వానరరాజు సుగ్రీవుని మంత్రిని
నన్ను పిలుతురు హనుమంతుడని .
రామ సుగ్రీవులు మిత్రులైనారు
నీ జాడ తెలియ వేచియున్నారు . 171
రామలక్ష్మణులు వానర రాజుతో
లంక చేరెదరు వానర కోటితో .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 172 | శ్రీ హనుమాను |
ఓ హనుమంతా ! హాయి పొందితిని
నీ పలికిన శ్రీరామ కథ విని .
రామలక్ష్మణుల యెట్లెరిగితివి ?
రూపు రేఖలను యెట్లు గాంచితివి ?173
వారి మాటలను యెట్లు వింటివి ?
వారి గుణములను యెట్లు తెలిసితివి ?
అని పల్కె సీత హనుమంతునితో
రామ కథను కీర్తించిన వానితో . 174
సర్వ జీవన సంప్రీతి పాత్రుడు
కమల నేత్రుడు దయా సాంద్రుడు .
బుద్ధి యందు బృహస్పతి సముడు
కీర్తి యందు దేవేంద్రుని సముడు . 175
క్షమా గుణమున పృథివీ సముడు
సూర్య తేజుడు శ్రీరఘురాముడు .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 176
అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు
అన్నిట రాముని సరిపోలు వాడు .
అన్నకు తోడు నీడయై చెలగెడు
అజేయుడు శత్రుభయంకరుడు . 177
సామాన్యులు కారు సోదరులిరువురు
నిను వెదకుచు మమ్ము కలసినారు .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 178
పవనకుమారుని పలుకులను విని
అతడు నిజముగా రామదూత యని .
ఆనందాశ్రులు కన్నులు నిండగ
చిరు నగవులతో జానకి చూడగ . 179
ఇదిగో తల్లీ ! యిది తిలకింపుము
రాముడంపిన అంగుళీయకము .
అని హనుమంతుడు భక్తి మీరగను
అంగుళీయకమును సీతకొసగెను . 180 | శ్రీ హనుమాను |
రామచంద్రుని ముద్రిక చేకొని
అశ్రులు నిండిన కనులకద్దుకొని .
మధుర స్మృతులు మదిలో మెదల
సిగ్గు చేత తన శిరము వంచుకొని . 181
యిన్ని రోజులకు తనకు కలిగిన
శుభ శకునముల విశేషమనుకొని .
జానకి పల్కె హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 182
యెన్నడు రాముడు యిటకేతెంచునో
యెన్నడు రావణుని హతము సేయునో ?
లక్ష్మణుండు తన అగ్ని శరములతో
కౄర రాక్షసుల రూపు మాపునో ? 183
సుగ్రీవుడు తన వానరసేనతో
చుట్టి ముట్టి యీ లంకను గూల్చునో ?
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 184
రామలక్ష్మణులు వచ్చుదాకను
బ్రతుకనిత్తురా అసురులు నన్ను ?
రావణుడొసగిన యేడాది గడువు
రెండు నెలలలో యిక తీరిపోవు . 185
ప్రాణములను అరచేత నిల్పుకొని
యెదురు చూతునీ రెండు మాసములు .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 186
నీ వలెనే శ్రీరామచంద్రుడు
నిద్రాహారములు మరచెనమ్మా !
ఫలపూష్పాదులు ప్రియమైనవి గని
“హా సీతా” యని శోకించునమ్మా . 187
నీ జాడ తెలిసి కోదండపాణి
తడవు సేయకే రాగలడమ్మా .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 188
ఓ హనుమంతా ! నిను గనినంత
నాలో కలిగె ప్రశాంతత కొంత .
వానరోత్తమా ! నిను వినినంత
నే పొందితిని వూరట కొంత . 189
రాముని వేగమె రమ్మని తెల్పుము
రెండు నెలల గడువు మరువబోకుము .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 190 | శ్రీ హనుమాను |
తల్లీ నీవిటు శోకింపనేల
వగచి వగచి యిటు భీతిల్లనేల ?
యిపుడే నీకీ చెర విడిపింతును
కూర్చుండుము నా మోపు మీదను . 191
వచ్చిన త్రోవనే కొనిపోయెదను
శ్రీరామునితో నిను చేర్చెదను .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 192
పోనివ్వక పోతివిగా హనుమా !
సహజమైన నీ చంచల భావము .
అరయగ అల్ప శరీరుడవీవు
యే తీరుగ నను కొని పోగలవు ?193
రాముని కడకే నను చేర్చెదవో
కడలిలోననే జారవిడుతువో .
అని పల్కె సీత హనుమంతునితో
తనలో కలిగిన వాత్సల్యముతో . 194
సీత పలికిన మాటల తీరును
హనుమంతుడు విని చిన్నబోయెను .
సీత చెంత తన కామ రూపమును
ప్రదర్శింపగా సంకల్పించెను . 195
కొండంతగ తన కాయము పెంచెను
కాంతివంతుడై చెంత నిలచెను .
జయ హనుమంతుని కామరూపమును
ఆశ్చర్యముతో జానకి చూచెను . 196
అద్భుతమౌ నీ కామరూపమును
కాంచితినయ్యా శాంతింపుమయ్యా !
పవనకుమారా నీవు గాక మరి
యెవరీ వారిధి దాటెదరయ్యా ! 197
కౄర రాక్షసుల కంట బడకయే
లంక వెదకి నను కనగలరయ్యా .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 198 | శ్రీ హనుమాను |
తల్లీ ! నేను నీ యందుగల
భక్తి భావమున అటుల తెల్పితి .
కౄర రాక్షసుల బారి నుండి నిను
కాపాడనెంచి అటుల పల్కితి . 199
వేగమె నిన్ను రాముని జేర్చెడు
శుభ ఘడియలకై త్వరపడి పల్కితి .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 200
తల్లీ నీవు తెలిపినవన్నీ
శ్రీరామునకు విన్నవించెదను .
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు
శ్రీరామునకు తగిన భార్యవు . 201
అమ్మా యిమ్ము యేదో గురుతుగ
శ్రీరాముడు గని ఆనందింపగ .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . 202
చిత్రకూటమున కాకాసురు కథ
కన్నీరొలుకగ గురుతుగ తెలిపి .
చెంగుముడి నున్న చూడామణిని
మెల్లగ తీసి మారుతికొసగి . 203
పదిలముగా కొని పోయిరమ్మని
శ్రీరామునకు గురుతుగ నిమ్మని .
ప్రీతి పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 204
చేతులారగా చూడామణి గొని
ఆనందముగా కనులకద్దుకొని .
వైదేహికి ప్రదక్షిణలు జేసి
పదముల వ్రాలి వందనములిడి . 205
మనమున రాముని ధ్యానించుకొని
మరలిపోవగా అనుమతి గైకొని .
అంజనీసుతుడు కాయము పెంచె
ఉత్తర దిశగా కుప్పించి యెగసె . 206 | శ్రీ హనుమాను |
సీత జాడ గని మరలిన చాలదు
చేయవలసినది యింకను కలదు .
కల్పించుకుని కలహము పెంచెద
అసురవీరుల పరిశీలించెద . 207
రాక్షస బలముల శక్తి గ్రహించెద
సుగ్రీవాదులకు విన్నవించెద .
అని హనుమంతుడు యోచన జేయుచు
తోరణ స్తంభము పైన నిల్చెను . 208
పద్మాకరముల పాడొనరించి
జలాశయముల గట్టులు త్రెంచి .
ఫల వృక్షముల నేలను కూల్చి
ఉద్యానముల రూపులు మాపి . 209
ప్రాకారముల బ్రద్దలు చేసి
ద్వారబంధముల ధ్వంసము జేసి .
సుందరమైన అశోకవనమును
చిందర వందర చేసె మారుతి . 210
మృగ సమూహములు భీతిల్లినవై
తత్తరపాటుగ పరుగులు తీయగ .
పక్షుల గుంపులు చెల్లాచెదరై
దీనారవముల యెగిరి పోవగా . 211
సీత యున్న శింశుపా తరువు వినా
వనమంతయు వినాశము కాగా .
సుందరమైన అశోకవనమును
చిందర వందర చేసె మారుతి . 212
వనమున రేగిన ధ్వనులకు అదిరి
లంకావాసులు నిద్ర లేచిరి .
కావలియున్న రాక్షస వనితలు
రావణు చేరి విన్నవించిరి . 213
దశకంఠుడు మహోగ్రుడై పల్కె
వానరుని బట్టి దండింపుడనె .
యెనుబది వేల కింకర వీరులు
హనుమంతునిపై దాడి వెడలిరి . 214
యెనుబది వేల కింకర వీరుల
వొక్క వానరుడు హతము చేసెను .
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను . 215
జంబుమాలిని తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను .
జంబుమాలి ప్రహస్తుని సుతుడు
హనుమంతుని పై దాడి వెడలెను . 216 | శ్రీ హనుమాను |
జంబుమాలిని సర్వ సైన్యమును
వొక్క వానరుడు ఉక్కడగించెను .
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను . 217
మంత్రికుమారుల తగిన బలము గొని
ఆ వానరుని దండింపగ పొమ్మనె .
మంత్రికుమారులు యేడ్గురు చేరి
హనుమంతునిపై దాడి వెడలిరి . 218
మంత్రిసుతులను సర్వ సైన్యమును
మారుతి తృటిలో సంహరించెను .
యెటు చూచినను మృత దేహములు
యెటు పోయినను రక్తపుటేరులు . 219
ఈ వృత్తాంతము వినిన రావణుడు
కొంత తడవు యోచించి పల్కెను .
సేనాపతులను తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను . 220
సేనాపతులను సర్వ సైన్యమును
పవనకుమారుడు నిర్మూలించెను .
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిశ్చేష్టితుడై పరివీక్షించెను . 221
తండ్రిచూపులు తనపై సోకగ
అక్ష కుమారుడు ఇటవుగ నిలువగ .
రావణుండు పల్కె కుమారుని గని
ఆ వానరుని దండింప పొమ్మని . 222 | శ్రీ హనుమాను |
అక్షకుమారుడు నవ యవ్వనుడు
వేగవంతుడు తేజోవంతుడు .
దివ్యాస్త్రములను పొందినవాడు
మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు . 223
కాలాగ్ని వోలె ప్రజ్వరిల్లెడు
రణధీరుడు మహావీరుడు .
అక్షకుమారుడు దివ్య రథము పై
దాడి వెడలెను హనుమంతుని పై . 224
మూడు శరములతో మారుతి శిరమును
పది శరములతో మారుతి ఉరమును .
అక్షకుమారుడు బలముగ నాటెను
రక్తము చిందగ గాయ పరచెను . 225
ఉదయ భాస్కర సమాన తేజమున
మారుతి యెగసె గగన మార్గమున .
యిరువురి నడుమ భీకరమైన
పోరు చెలరేగె ఆకాశమున . 226
అతి నేర్పు తోడ రణము సల్పెడు
అక్షకుమారుని మారుతి దయగొని .
బాలుని చంపగ చేతులు రావని
వేచిచూచెను నిగ్రహించుకొని . 227
అక్షకుమారుడు అంతకంతకును
అగ్నిహోత్రుడై రణమున రేగెను .
యిరువురి నడుమ భికరమైన
పోరు చెలరేగె ఆకాశమున . 228
అగ్ని కణమని జాలి కూడదని
రగులక మునుపే ఆర్పుట మేలని .
సింహనాదమును మారుతి చేసెను
అరచేత చరచి హయముల జంపెను . 229
రధమును బట్టి విరిచి వేసెను
అక్షుని ద్రుంచి విసరి వేసెను .
అక్షుని మొండెము అతి ఘోరముగ
నేలపై బడె రక్తపు ముద్దగ . 230
అక్ష కుమారుని మరణ వార్త విని
లంకేశ్వరుడు కడు దుఃఖించెను .
మెల్లగ తేరి క్రోధము బూని
తన కుమారుని ఇంద్రజిత్తు గని . 231
ఆ వానరుడు సామాన్యుడు గాడని
వానిని వేగ బంధించి తెమ్మని .
రావణాసురుడు ఇంద్రజిత్తును
హనుమంతుని పై దాడి పంపెను . 232
కపికుంజరుడు భయంకరముగ
కాయము పెంచి సమరము సేయగ .
ఈ వానరుడు సామాన్యుడు గాడని
మహిమోపేతుడు కామరూపుడని . 233
ఇంద్రజిత్తు బహుయోచన చేసి
బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె .
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి యేమగునోయని . 234
బ్రహ్మాస్త్రము చే బంధింపబడి
పవనకుమారుడు నేలపై బడె .
వనజభవుడు తనకు వొసగిన వరము
స్మరియించుకొని ప్రార్థన చేసె . 235
వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల
కాపాడుమని ధ్యానము చేసె .
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి యేమగునోయని . 236
కట్టుపడియున్న వానరోత్తముని
అసురులు తలచిరి తమకు లొంగెనని .
త్వరత్వరగా దానవులు దరి చేరి
నారచీరెలతో బిగి బంధించిరి . 237
బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర బంధము
క్షణకాలములో తొలగి పోయెను .
మారుతి మాత్రము నారచీరెలకె
కట్టుపడినటుల కదలక యుండె . 238
వానరోత్తముని దూషణలాడుచు
రావణు కడకు యీడ్చుకు పోవగ .
ఈ వానరుని వధించివేయుడని
మన యెడ ద్రోహము చేసినాడని . 239
రక్తనేత్రముల నిప్పులు రాలగ
లంకేశ్వరుడు గర్జన సేయగ .
రావణు తమ్ముడు విభీషణుడు
దూతను చంపుట తగదని తెల్పెను . 240 | శ్రీ హనుమాను |
అన్నా రావణా ! తెలిసినవాడవు
శాంతముగా నా మనవిని వినుమా .
దూతను జంపుట ధర్మము గానిది
లోకముచే గర్హింపబడునది . 241
శూరుడవైన నీకు తగనిది
రాజధర్మ విరుద్ధమైనది .
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెల్పెను . 242
అన్నా ! వీనిని వధింపకుమా
తగు రీతిని దండించి పంపుమా .
దూత యెడల విధింపబడినవి
వధ గాక తగిన దండనలున్నవి . 243
తల గొరిగించుట, చబుకు వేయుట,
గురుతు వేయుట, వికలాంగు సేయుట .
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెల్పెను . 244 | శ్రీ హనుమాను |
కపులకు వాలము ప్రియ భూషణము
కావున కాల్చుడు వీని వాలము .
వాడ వాడల వూరేగింపుడు
పరాభవించి వదలివేయుడు . 245
కాలిన తోకతో వీడేగు గాక !
అంపిన వారికి తలవొంపు గాక !
అని రావణుడు విభీషణుని గని
ఆజ్ఞాపించెను కోపమణచుకొని . 246
జీర్ణాంబరములు అసురులు దెచ్చిరి
వాయుకుమారుని తోకకు జుట్టిరి .
నూనెతో తడిపి నిప్పంటించిరి
మంటలు మండగ సంతసించిరి . 247
కపికుంజరుని యీడ్చుకు పోయిరి
నడి వీధులలో వూరేగించిరి .
మారుతి మాత్రము మిన్నకుండెను
సమయము కాదని సాగిపోయెను . 248
కపిని బంధించి తోక గాల్చిరని
నడి వీధులలో త్రిప్పుచుండిరని .
రాక్షస వనితలు వేడుక మీరగ
పరుగున పోయి సీతకు తెలుపగ . 249
అంతటి ఆపద తన మూలమున
వాయుసుతునకు వాటిల్లెనని .
సీతా మాత కడు చింతించెను
అగ్ని దేవుని ప్రార్థన చేసెను . 250
ఓర్వరానివై మండిన మంటలు
ఒక్కసారిగా చల్లగ దోచెను .
అగ్ని దేవునకు, నా జనకునకు
అన్యోన్యమైన మైత్రిచేతనో . 251
రామ దూతనై వచ్చుట చేతనో
సీతా మాత మహిమ చేతనో .
మండే జ్వాలలు పిల్లగాలులై
వీవసాగెనని మారుతి పొంగెను . 252
ఆనందముతో కాయము పెంచెను
బంధములన్నీ తెగిపడిపోయెను .
అడ్డగించిన అసురులందరని
అరచేత చరచి అట్టడగించెను . 253
గిరిశిఖరము వలె యెత్తుగ నున్న
నగర ద్వార గోపురమందున .
స్తంభము పైకి మారుతి యెగసెను
లంకాపురమును పరివీక్షించెను . 254 | శ్రీ హనుమాను |
యే మంటల నా వాలము గాల్చిరో
ఆ మంటలనే లంక గాల్తునని .
భీమ రూపుడై గర్జన సేయుచు
రుద్ర రూపుడై మంటల జిమ్ముచు . 255
మేడ మిద్దెల వనాల భవనాల
వెలిగించెను జ్వాలా తోరణాల .
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించె మారుతి . 256
ఒకచో కుంకుమ కుసుమ కాంతుల
ఒకయెడ బూరుగు పుష్పఛాయల .
ఒకచో మోదుగు విరుల తేజముల
ఒకయెడ కరగిన లోహపు వెలుగుల . 257
కోటి సూర్య సమాన కాంతుల
లంకాపురము రగిలెను మంటల .
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించె మారుతి . 258 | శ్రీ హనుమాను |
హనుమంతుడు సముద్ర జలాల
చల్లార్చుకొనే లాంగూల జ్వాల .
తలచిన కార్యము నెరవేర్చితినని
తేరిపార జూచె వెనుకకు తిరిగి . 259
కనుపించెను ఘోరాతిఘోరము
జ్వాలాభీలము లంకాపురము .
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోపమె తన శత్రువాయెనని . 260
సీతామాత క్షేమము మరచితి
కోపతాపమున లంక దహించితి .
లంకా పురము సర్వము పోగా
ఇంకా జానకి మిగిలియుండునా ?261
సిగ్గు మాలిన స్వామి ద్రోహిని
సీతను చంపిన మహాపాపినని .
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోసమె తన శత్రువాయెనని . 262
సీత లేనిదె రాముడుండడు
రాముడు లేనిదె లక్ష్మణుడుండడు .
భరత శత్రుఘ్న సుగ్రీవాదులు
ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు . 263
ఈ ఘోరమునకు కారణమైతిని
నాకు మరణమే శరణ్యమని .
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోపమే తన శత్రువాయెనని . 264
శ్రీరఘురాముని ప్రియసతి సీత
అగ్ని వంటి మహా పతివ్రత .
అగ్నిని అగ్ని దహింపనేర్చునా ?
అయోనిజను అగ్ని దహించునా ?265
నను కరుణించిన అగ్ని దేవుడు
సీతను చల్లగ చూడకుండునా ?
అని హనుమంతుడు తలచుచుండగా
శుభ శకునములు తోచె ప్రీతిగా . 266
యెల్ల రాక్షసుల సిరి సంపదలు
మంటల పాలై దహనమాయెనని .
అశోక వనము ధ్వంసమైనను
జానకి మాత్రము క్షేమమేనని . 267
లంకాపురము రూపుమాసినను
విభీషణు గృహము నిలిచి యుండెనని .
అంబర వీధిని సిద్ధచారణులు
పలుకగా విని మారుతి పొంగెను . 268 | శ్రీ హనుమాను |
అశోక వనము మారుతి చేరెను
ఆనందాశ్రుల సీతను గాంచెను .
తల్లీ ! నీవు నా భాగ్యవశమున
క్షేమముంటివని పదముల వ్రాలెను . 269
పోయి వత్తునిక సెలవునిమ్మని
అంజలి ఘటించి చెంత నిలచెను .
సీతా మాత హనుమంతునితో
ప్రీతిగ పలికెను ఆనందముతో . 270
హనుమా ! అతులిత బలధామా !
శత్రుకర్శణా ! శాంతినిదానా !
యిందుండి నన్ను యీ క్షణమందే
కొనిపోగల సమర్థుడవీవే . 271
రాముని వేగమె తోడ్కొని రమ్ము
రాక్షస చెర నాకు తొలిగింపుము .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . 272
తల్లీ ! నిన్ను చూచినదాదిగ
త్వరపడుచుంటిని మరలిపోవగా .
భీతినొందకుము నెమ్మదినుండుము
త్వరలో నీకు శుభములు కలుగు . 273
రామలక్ష్మణ సుగ్రీవాదులను
అతి శీఘ్రముగా కొనిరాగలను .
అని మారుతి సీత పదముల వ్రాలె
సెలవుగైకొని రివ్వున మరలె . 274 | శ్రీ హనుమాను |
అరిష్టమను గిరిపై నిలిచి
మారుతి యెగసెను కాయము పెంచి .
పవనకుమారుని పదఘట్టనకే
పర్వతమంతయు పుడమిని కృంగె . 275
సీతను గాంచిన శుభవార్త వేగ
శ్రీరామునకు తెలియచేయగ .
మారుతి మరలెను అతి వేగముగ
ఉత్తర దిశగా వారిధి దాటగ . 276
గరుడుని వోలె శరవేగము గొని
పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని .
మార్గ మధ్యమున మైనాకుని గని
ప్రేమ మీరగా క్షేమము కనుగొని . 277
దూరము నుండి మహేంద్ర శిఖరిని
ఉత్సాహమున ముందుగా గని .
విజయ సూచనగ గర్జన సేయుచు
మారుతి సాగెను వేగము పెంచుచు . 278
సుందరమైన మహేంద్రగిరి పైన
సెలయేట దిగి తానమాడి .
జాంబవదాది పెద్దలందరికి
వాయునందనుడు వందనములిడి . 279
చూచితి సీతను ! చూచితి సీతను !
అను శుభవార్తను ముందుగ పలికెను .
కపి వీరులు హనుమంతుని బొగడిరి
ఉత్సాహమున కిష్కింధకు సాగిరి . 280
జాంబవదంగద హనుమదాదులు
ప్రస్రవణగిరి చేరుకొనినారు .
రామ లక్ష్మణ సుగ్రీవాదులకు
వినయముతో వందనమిడినారు . 281
ఆంజనేయుడు శ్రీరామునితో
చూచితి సీతనని శుభవార్త తెల్పె .
చూడామణిని శ్రీరామునకిడి
అంజలి ఘటించి చెంతన నిలచె . 282 | శ్రీ హనుమాను |
చూడామణిని రాముడు గైకొని
తన హృదయానికి చేర్చి హత్తుకొని .
మాటలు రాని ఆనందముతో
అశ్రులు నిండిన నయనాలతో . 283
హనుమా ! సీతను యెట్లు గాంచితివి
యెట్లున్నది సీత, యేమి తెల్పినది ?
అని పలికిన శ్రీరామచంద్రునకు
మారుతి తెల్పె తన లంకా యానము . 284
శత యోజనముల వారిధి దాటి
లంకాపురమున సీతను గాంచితి .
రాలు కరుగగా సీత పలుకగ
నా గుండెల క్రోధాగ్ని రగులగ . 285
అసురుల గూల్చితి లంక దహించితి
రావణునితో సంవాదము సల్పితి .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . 286
నిరతము నిన్నే తలచుచున్నది
క్షణమొక యుగముగ గడుపుచున్నది .
రెండు నెలల గడువు తీరక మునుపే
వేగమె వచ్చి కాపాడుమన్నది . 287
రామలక్ష్మణ సుగ్రీవాదులకు
సీత క్షేమమని తెలుపమన్నది .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . 288
రామలక్ష్మణుల భుజముల నిడుకొని
వేగమె లంకకు గొని వత్తునని .
రామలక్ష్మణుల అగ్ని శరములకు
రావణాదులు కూలుట నిజమని . 289
యెన్నో రీతుల సీతా మాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . 290
అందరు కలసి అయోధ్యకు చేరి
ఆనందముగా సుఖించెదరని .
సీతారామ పట్టాభిషేకము
కనుల పండువుగ జరిగి తీరునని . 291
యెన్నో రీతుల సీతా మాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . 292
ఆనందముతో అశ్రులు జారగ
సీతామాత నను దీవించగ .
పదముల వ్రాలి నే పయనమైతిని
పదములు రాక నే మరలి వచ్చితిని . 293
ఒప్పలేదు కాని యెపుడో తల్లిని
భుజముల నిడుకొని కొనిరాకుందునా ?
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . 294 | శ్రీ హనుమాను |
సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెలుపకుండిన .
నేటి తోడ మా రఘుకులమంతా
అంతరించి యుండెడిది కదా ! 295
మమ్మీ తీరుగ ఉద్ధరించిన
మారుతికి యేమివ్వగలనని .
సర్వమిదేనని కౌగిట జేర్చెను
హనుమంతుని ఆజానుబాహుడు . 296 | శ్రీ హనుమాను |
నలుగురు శ్రద్ధతో ఆలకించగ
నలుగురు భక్తితో ఆలపించగ .
సీతారామహనుమానులు సాక్షిగ
సర్వజనులకు శుభములు కలుగగ . 297
కవి కోకిల వాల్మీకి పలికిన
రామాయణమును తేట తెలుగున .
శ్రీ గురు చరణా సేవా భాగ్యమున
పలికెద సీతారామ కథ . 298 | శ్రీ హనుమాను |
మంగళ హారతి గొను హనుమంతా
సీతారామ లక్ష్మణ సమేతా
నా అంతరాత్మ నిలుమో అనంతా
నీవే అంతా శ్రీ హనుమంతా .

[download id=”398437″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!